ఏపీలో మా మద్దతు ఆ పార్టీకేనని తేల్చి చెప్పిన అసదుద్దీన్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి తెలంగాణకు చెందిన బడా నేత నుండి మద్దతు వచ్చింది

By Medi Samrat  Published on  2 May 2024 11:15 AM IST
ఏపీలో మా మద్దతు ఆ పార్టీకేనని తేల్చి చెప్పిన అసదుద్దీన్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి తెలంగాణకు చెందిన బడా నేత నుండి మద్దతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమరం మొదలవ్వగా.. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు కట్టుబడిన లౌకిక నాయకుడని అసదుద్దీన్ తెలిపారు. వైఎస్సార్‌సీపీకి మద్దతివ్వాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లను ఒవైసీ కోరారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అవకాశవాదిగా, విశ్వసనీయత లేని నాయకుడని ఒవైసీ ఘాటుగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు అంతం కానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీకి ఒవైసీ మద్దతిచ్చారు.

మైనారిటీల హక్కులను పరిరక్షించేది జగన్ మాత్రమేనని అసదుద్దీన్ అన్నారు. ఆంధ్రాలో టీడీపీ, జనసేన నటులైతే.. దేశం మొత్తానికి నరేంద్ర మోదీ మహా నటుడని అన్నారు. ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే మోదీ చేతిలో బాబు కీలుబొమ్మ అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story