సెప్టెంబర్ 15 నాటికి తుది నివేదిక.. డిసెంబర్ 31లోపు ప్రక్రియ ముగిస్తాం..!
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఈరోజు సచివాలయంలో తొలిసారి భేటీ అయ్యింది.
By Medi Samrat
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఈరోజు సచివాలయంలో తొలిసారి భేటీ అయ్యింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది నివేదిక ఇవ్వాలని భేటీలో నిర్ణయించారు.
ఈనెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి మంత్రుల బృందం ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. ఈలోపు ప్రజలు కూడా తమ వినతులను జిల్లా కలెక్టర్‌కు పంపించవచ్చని సూచించారు. సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వీభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు ప్రక్రియ ముగిస్తామని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు కోసం కసరత్తు చేస్తామని వెల్లడించారు.
రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల బృందం పని చేస్తుందని తెలిపారు. నియోజకవర్గాల జోలికి వెళ్లబోమని మంత్రి అనగాని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని.. అయితే పరిపాలనా సౌలభ్యమే గీటురాయి అని మంత్రి అనగాని పేర్కొన్నారు.