దేశానికి ఆ పేరు పెట్టాలి
APCC Leader Shailaja Nath Recats On Amalapuram Incident. కోనసీమ జిలాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుపెట్టినందుకు
By Medi Samrat
కోనసీమ జిలాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుపెట్టినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతకుఘోర అవమానం జరిగిందని, ఒక్క కోనసీమ జిల్లాకే కాదు.. యావత్ దేశానికే "మహాత్మా గాంధీ - డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశం" అని పేరు పెట్టాలని సూచించారు. కొత్తగా జిల్లా ఏర్పాటు చేసినప్పుడు వెలువడిన గెజిట్ లో పేరు పెట్టకుండా ఇప్పుడు హడావిడిగా పెరు మార్పు చూస్తుంటే ఇది కేవలం జగన్ రెడ్డి రాజకీయ కుట్ర లో భాగంగా వుందని శైలజానాథ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేలా జగన్ రెడ్డి ప్రభుత్వ ధోరణి వున్నదని విమర్శించారు.
చాలా సంవత్సరాల నుండి కొనసీమకు డా.బి.ఆర్.అంబేత్కర్, కర్నూల్ కి దామోదరం సంజీవయ్య ల పెరు పెట్టాలని ప్రతిపాదించినా, కొత్త జిల్లాల ఏర్పాటులో ఆ పేర్లు పెట్టకుండా చేయటం కూడా జగన్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని అన్నారు. మహనీయుడు అంబేద్కర్ లాంటి వారి స్థాయి లేకపోయినా కూడా ఇతర జిల్లాలకు కొందరి పేర్లు పెడితే అందరం సమర్ధిస్తే, ప్రశాంతతకు మారు పేరు అయినా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ పేరు పెడితే ఇలాంటి సంఘటనలకు పాల్పడడం కుల దురహంకారానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గౌరవ భావం ఉంటుందని, ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జేఏసీ ల ముసుగులో దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని శైలజనాధ్ డిమాండ్ చేశారు.