ఆ రహదారికి వంగవీటి పేరు పెట్టాలి..ఏపీ సీఎంకు షర్మిల లేఖ
విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని లేఖలో షర్మిల కోరారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 4:31 PM IST
ఆ రహదారికి వంగవీటి పేరు పెట్టాలి..ఏపీ సీఎంకు షర్మిల లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని లేఖలో షర్మిల కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ నుంచి గన్నవరం దగ్గరలోని చిన్న అవుటుపల్లి వరకు 47.8 కిలోమీటర్ల దూరం గల విజయవాడ పశ్చిమ జాతీయ బైపాస్ రహదారి పూర్తి కావొచ్చిన సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆరు వరుసల రహదారి ద్వారా విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంత మేర గట్టెక్కుతాయని ఆమె లేఖలో తెలిపారు.
ఈ బైపాస్ రహదారికి విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు, స్వర్గీయ వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కాంగ్రస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో రాశారు. వంగవీటి రంగా ప్రజలకు చేసిన సేవ అనిర్వచనీయమని షర్మిల అన్నారు. సామాజిక న్యాయంపై దృష్టి సారించి, అణగారిన వర్గాల సంక్షేమ కోసం వాదించి.. భూమి లేని వారికి భూ పంపిణీ చేశారని అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా.. అని షర్మిల అన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి 'వంగవీటి మోహన రంగా బైపాస్ జాతీయ రహదారి' అని పెట్టాలని కోరుతున్నట్లు సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు.