Andhra Pradesh : తీవ్ర అల్పపీడనంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
By - Medi Samrat |
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సహాయక చర్యల కోసం NDRF, SDRF, పోలీస్, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని హోం మంత్రి ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పొంగిపొర్లే కాలువలు, రహదారులు దాటే ప్రయత్నాలు చేయరాదని, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, లేదా శిధిల భవనాల వద్ద నిలబడరాదని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించి, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను లేదా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని అన్నారు.