ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు కోసం పోరాటం చేస్తున్నామంటున్న వైసీపీ .. నెరవేరుతుందా..?
ఇటీవల పార్లమెంట్ లో చోటు చేసుకున్న సీన్స్ మనం గమనిస్తే బలమైన ప్రతి పక్షం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.
By Medi Samrat Published on 2 July 2024 4:15 PM GMTఇటీవల పార్లమెంట్ లో చోటు చేసుకున్న సీన్స్ మనం గమనిస్తే బలమైన ప్రతి పక్షం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉండగా విపక్షాలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఎంతో బలంగా విపక్షాలు చాలా ఏళ్ల తర్వాత కనిపిస్తున్నాయి. బీజేపీలో కూడా మునుపటి దూకుడు అయితే లోక్ సభలో కనిపించలేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు కొల్లగొట్టాలని బీజేపీ ఆశించగా.. 240కే పరిమితమైంది. జేడీయూ 12, టీడీపీ 16 స్థానాలతో సత్తా చాటడం.. ఇతర పార్టీలు కూడా బీజేపీతో చేతులు కలపడంతో అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ వరుసగా మూడో సారి ప్రధాని అయ్యారు.
ఇప్పుడు టీడీపీ, జేడీయూ పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు డిమాండ్లను కేంద్రం ముందు పెట్టి కావాల్సినవి సాధించుకునే గోల్డెన్ అవకాశం వచ్చింది. అందులో భాగంగా జేడీయూ బీహార్ కు స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టేసింది. బీహార్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నది దేశ ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఆ రాష్ట్రం స్పెషల్ స్టేటస్ కోరుకుంటూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే 2014లో ఏపీకి స్పెషల్ స్టేటస్ రావడం పక్కా అని కూడా అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్యాకేజీ కోరారు. వైసీపీ మాత్రం స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేస్తూ ఉంది. 2019 ఎన్నికల తర్వాత వైసీపీకి 22 స్థానాలు వచ్చినా కూడా బీజేపీని కదపలేని స్థాయిలో సీట్లు రావడంతో ఇక చేసేది లేక సైలెంట్ గా ఉండిపోయింది వైసీపీ.
ఇప్పుడు 2024లో కేంద్రంలోని బీజేపీకి టీడీపీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఇప్పుడు కూడా టీడీపీ.. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ అడగకపోతే ఘోర తప్పిదం చేసినట్లే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు స్పెషల్ స్టేటస్ ను అడగాలని పట్టుబడుతూ ఉన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రత్యేక కేటగిరీ హోదా విషయంలో తన వాయిస్ ను వినిపించారు. ఇది కేవలం డిమాండ్ మాత్రమే కాదని.. అన్యాయమైన విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కు అంటూ చెప్పుకొచ్చారు. ఇది ఖచ్చితంగా అటు టీడీపీని.. ఇటు బీజేపీని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నమే. అయితే ఇది ఏపీ ప్రజల్లో వర్కౌట్ అవుతుందా.. లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.