ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ ఉండడంతో ప్రభుత్వం మరిన్ని సడలింపులను జారీ చేసింది. రాష్ట్రంలో ఎటువంటి ఆంక్షలు అమలులో లేకుండా చేస్తున్నారు. కరోనాపై మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణతో పాటు పలువురు అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశం అనంతరం ఏపీలో కర్ఫ్యూ నిబంధనలను మరింత సడలించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒకే విధంగా కర్ఫ్యూ నిబంధనల అమలు చేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ ఉండదు. రాత్రి 9 గంటలకు అన్ని దుకాణాలు మూసి వేయాల్సి ఉంటుంది.
దుకాణాల్లో సిబ్బందితో పాటు కొనుగోలుదారులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలకు భారీ జరిమానా విధించనున్నారు. ఇటీవలి కాలంలో కరోనా కేసులు బాగా తగ్గడం.. ఎక్కువగా కరోనా కేసులు ఉన్న కొన్ని జిల్లాలలో కూడా కరోనా కట్టడవ్వడంతో ఇక కేవలం రాత్రి పూట మాత్రమే కర్ఫ్యూను అమలు చేస్తూ ఉన్నారు. అయితే కరోనా కట్టడి విషయంలో నిబంధనలను మాత్రం పాటించాల్సిందేనని చెబుతూ ఉన్నారు.