ఏపీలో జీతాలపై కొనసాగుతున్న‌ సందిగ్ధత

AP PRC Issue. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద్యోగుల స‌మ్మె కారణంగా వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై

By Medi Samrat  Published on  29 Jan 2022 2:05 PM GMT
ఏపీలో జీతాలపై కొనసాగుతున్న‌ సందిగ్ధత

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద్యోగుల స‌మ్మె కారణంగా వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ఆర్ధిక శాఖ. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకు తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ట్రెజరీస్ డైరెక్టర్ కు, పే అండ్ అంకౌంట్స్ అధికారులను ఆదేశించింది. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్.

పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలంటూ ఉద్యోగులు ఉద్యమిస్తుండగా, కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా ట్రెజరీ సిబ్బందికి మెమోలు జారీ చేసింది. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. నేటి సాయంత్రం 6 గంటల్లోపు తమ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే చర్యలు ఉంటాయని పేర్కొంది. కొత్త పీఆర్సీ ప్రకారం హెచ్ఆర్ఏను సవరించారు. విజయవాడలోని హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం పెంచారు.


Next Story