నారా లోకేష్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి: పోలీసు సంఘం

AP Police Officers Association On Lokesh Words. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను

By Medi Samrat  Published on  23 Aug 2021 4:45 AM GMT
నారా లోకేష్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి: పోలీసు సంఘం

బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కోరారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని చెప్పారు. ఇలాంటి వార్తల వల్ల బాలిక కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. తాను బాధిత బాలిక తల్లిదండ్రులతో మాట్లాడానని, చిన్నారిపై అత్యాచారయత్నం జరగలేదని వారు చెప్పారని అన్నారు. కానిస్టేబుల్ తమ కుమార్తెతో చనువుగా వ్యవహరిస్తుండడంతో మందలించి ఫిర్యాదు చేసినట్టు వారు చెప్పారని ఎస్పీ వివరించారు.

కానిస్టేబుల్ రమేశ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేసిన ఆరోపణలు సరికాదని ఏపీ పోలీసు అధికారుల సంఘం పేర్కొంది. ఈ ఘటనను లోకేశ్ రాజకీయంగా వాడుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. లోకేశ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు సంఘం వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప స్పందిస్తూ.. పోలీసు సంఘం చేసిన ప్రకటన నేరం చేసిన పోలీసులను రక్షించేలా ఉందని మండిపడ్డారు. పోలీసుల మనోభావాలను లోకేశ్ దెబ్బతీయలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవవుతున్నాయని మాత్రమే అన్నారని చినరాజప్ప పేర్కొన్నారు.

గుంటూరులో ఓ కానిస్టేబుల్‌ ఎంతగా వారిస్తున్నా తమ కుమార్తెతో చనువుగా మాట్లాడుతున్నారని ఆమె తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌కు ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని చెప్పారు. తాము వారిస్తున్నా సరే మాట్లాడుతుండటం మాత్రమే తమ అభ్యంతరం అని స్పష్టంగా చెప్పారు. దీంతో ఆ కానిస్టేబుల్‌ను ఈ నెల 20న సస్పెండ్‌ చేశారు. అతనిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఈ నెల 21న ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు.


Next Story