గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలుండాలి..?

Ap Panchayat election rules and regulations. ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. సర్పంచ్‌ పదవికి నువ్వా

By Medi Samrat  Published on  29 Jan 2021 3:30 PM GMT
గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలుండాలి..?

ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. సర్పంచ్‌ పదవికి నువ్వా..? నేనా..? అన్నట్లు బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు. అయితే సర్పంచ్‌గా పోటీ చేయాలంటే కొన్ని అర్హతలుండాలి. ఏ మాత్రం తేడా వచ్చిన అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది. సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి అర్హతలుండాలో ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ అర్హులేంటో చూద్దాం..

ఎవరు అర్హులు

సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే వ్యక్తి గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి. వయసు నామినేషన్‌ దాఖలు చేసే తేదీ నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరి అభ్యర్థులు జనరల్‌ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మహిళలకు రిజర్వ్‌ చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.

ఎవరు అనర్హులు

గ్రామ సేవకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగులు సర్పంచ్‌గా పోటీ చేసేందుకు అనర్హులు. చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా ఒక సంస్థకు చెందిన పాలక మండలి సభ్యులు, నేరాలకు పాల్పడి శిక్ష పడిన వారు, శిక్ష పూర్తిగా అనుభవించిన తర్వాత ఐదేళ్లు పూర్తి కాని వారు అనర్హులు, అలాగే పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడిన వారు, మతిస్థిమితం లేనివారు, బధిరులు, మూగవారు, దివాలాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు. అలాగే రుణ విమోచన పొందని దివాలాదారు, గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వ్యక్తులు, చెల్లింపునకు నోటీసు ఇచ్చినా గడువులోగా బకాయి చెల్లించని వారు గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు అనర్హులు.

అంతేకాకుండా ఇద్దరుకన్నా ఎక్కువ మంది పిల్లలున్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏదైనా స్థానిక సంస్థల కార్యాలయంలో పని చేసిన వ్యక్తి అవినీతి లేదా విశ్వాస ఘాతక నేరంపై తొలగించబడితే ఆ తేదీ నుంచి ఐదేళ్లు ముగిసే వరకు అనర్హులు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా సర్పంచ్‌ పోటీకి అనర్హులు.

కాగా, ఏపీలో తొలి పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్‌ పదవితో పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని నిర్ధారించిన వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు స్వీకరించనున్నారు.




Next Story