ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు : ప్రచారం ముగిసినా.. తెరవెనుక ఏర్పాట్లు జోరు.. భారీగా పట్టుబడిన నగదు

AP Municipal Elections 2021. ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకుల కూత ఆగిపోయింది. ఇక తెరవెనుక

By Medi Samrat  Published on  9 March 2021 9:08 AM IST
ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు : ప్రచారం ముగిసినా.. తెరవెనుక ఏర్పాట్లు జోరు.. భారీగా పట్టుబడిన నగదు
ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకుల కూత ఆగిపోయింది. ఇక తెరవెనుక మాత్రం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇదే జరుగుతోంది. పోలీసుల, అధికారుల నిఘా ఎంత ఉన్నా.. గుట్టు చప్పుడు కాకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు దర్శనమిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయవాడలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. విజయవాడలోని ఓ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లోని న్యూ-రాజరాజేశ్వరిపేటకు చెందిన వెల్డర్‌ పిల్ల కూర్మ నాయకులు అమరావతి కాలనీలోని మూడో రోడ్డులో నివాసం ఉంటున్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అతడి ఇంట్లో నగదు నిల్వ చేశారనే సమాచారరంతో టాస్క్‌ ఫోర్స్‌ ఎన్నికల ప్లయింగ్‌ స్వ్కాడ్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం రూ.48.44 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

అయితే కూర్మనాయకులు మాత్రం ఆ నగదు అంతా తనదేనని, ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను చూపిస్తానని చెప్పడంతో పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. పట్టుబడిన నగదుకు సంబంధించి సరై పత్రాలు చూపని కారణంగా ఆ మొత్తాన్ని సీజ్‌ చేశామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. నగదుకు సంబంధించిన పత్రాలను కూర్మ నాయకులు ఆదాయ పన్ను శాఖ అధికారులకు చూపాల్సి ఉందని అంటున్నారు. అయితే నగదుతో పట్టుబడిన సెంట్రల్‌ నియోజకవర్గంలోని గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ కార్పొరేటర్‌ అభ్యర్థికి సమీప బంధువు అని సమాచారం.




Next Story