ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ వేదికగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక అని ఆయన అన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చాడు. ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అంటూ సోషల్ మీడియాలో బాలయ్య పోస్టు పెట్టారు.
బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబుచేసిన వెన్నుపోటును ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. నెల్లూరు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్ గురించి అడిగే నైతిక హక్కు ఎక్కడిదని అన్నారు. ఆరోగ్య వర్సిటీ అనేది చాలా చిన్న అంశమని జిల్లాకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉండే అంశమని పేర్కొన్నారు. జిల్లాకు పేరు పెట్టినప్పుడు కృతజ్ఞత చెప్పలేని బాలకృష్ణ.. పౌరుషముంటే చంద్రబాబును నిలదీయాలని డిమాండ్ చేశారు. నందమూరి ఫ్యామిలీ కేరాఫ్ అడ్రస్ నారా గా మారిందని ఎద్దేవా చేశారు. పునర్జన్మ ఇచ్చిన వైఎస్సార్‌కు బాలయ్య రుణపడి ఉండాలని మంత్రి సూచించారు.