విశాఖలోని రుషికొండ భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి స్పందించింది. కేబినెట్ సబ్ కమిటీ మూడవ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీ టీఏ సీఈఓ ఆమ్రపాలి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. రుషికొండ భవనాలను హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కోసం వినియోగించాలా? అనే అంశాన్ని పరిశీలించామని మంత్రి పయ్యావుల తెలిపారు. రుషికొండ నిర్మాణాలపై మళ్లీ రెండు ఫ్లోర్లు వేసుకునే అవకాశం ఉందని తెలిపారు. హోటల్ కోసం అదనపు స్థలం కావాలని కొందరు అడిగారని చెప్పారు. రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల్లో 7 ఎకరాలు సీఆర్ జెడ్ నిబంధనల పరిధిలోకి వస్తాయని, అందులో ఎలాంటి నిర్మాణం జరపరాదన్నారు. ప్యాలెస్ చివరి రెండు బ్లాక్‌లు ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, టూరిజం అవసరాలకు ఉంచబడతాయని తెలిపారు. తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూప్, అట్మాస్పియర్ కోర్ వంటి గ్రూపులు ప్రాజెక్టుల కోసం ముందుకు వచ్చాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.