మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత అని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఆనందించే ప్రతీ పథకాన్ని అవహేళన చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందని.. దిగ్విజయంగా అమలవుతున్న స్త్రీ శక్తి పథకాన్ని చూసి కడుపుమంటతో ఓర్వలేకపోతోందని విమర్శించారు.
ఆధార్, పాన్, ఓటర్ కార్డుల లాంటివి జిరాక్సులు, సాఫ్ట్ కాపీలు కూడా అనుమతిస్తున్నామని.. ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం దిగ్విజయంగా అమలు కావడం వైసీపీ వారికి నచ్చడం లేదన్నారు. లక్షలాది మంది అక్క, చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలులో వైసీపీ నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ, అక్కసుతో ప్రవర్తించడం పట్ల ప్రజలు హర్షించరు.. ఇది సమంజసం కాదన్నారు.