బటన్ నొక్కడమే బ్రహ్మాండమైతే, బ్రహ్మరథం ఎందుకు పట్టలేదు?..జగన్‌పై మంత్రి నిమ్మల సెటైర్

బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే, ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదని జగన్‌పై ఏపీ మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.

By Knakam Karthik  Published on  7 Feb 2025 4:18 PM IST
Andrapradesh news, Telugu News, Ysrcp, Tdp, Janasena, Jagan,

బటన్ నొక్కడమే బ్రహ్మాండమైతే, బ్రహ్మరథం ఎందుకు పట్టలేదు?..జగన్‌పై మంత్రి నిమ్మల సెటైర్

ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. విధ్వంసకారుడే విధ్వంసం గురించి.. విధ్వంసానికి నిర్వచనం చెప్పడం ఈ శతాబ్ధపు విడ్డూరమని సెటైర్ వేశారు. దుష్టపాలన, తుగ్లక పాలనకు బదులుగా జగన్ పాలన అని ప్రజలు ఉదహరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఐదేళ్ల రివర్స్ పాలన చూసి దేశంలోని రాష్ట్రాలే కాదు.. ప్రపంచ దేశాలే నివ్వెరపోయాయని దుయ్యబట్టారు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రశ్నార్థకమైందని, డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఫలితంగా రూ.వెయ్యికోట్ల అదనపు ఖర్చు అవుతుందని అన్నారు.

ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎత్తును 41.15 మీటర్లు అని చెప్పి అణువు అణువునా అన్యాయం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాల ప్రగతి పాతాళం వైపు పరుగులు తీసిందని విమర్శించారు. ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్ అన్నట్లుగా జగన్ అరాచక పాలనలో ఎక్కడి పనులు అక్కడే బంద్ అయ్యాయని విమర్శించారు. ఎవరి డబ్బులు, ఎవరికి బటన్ నొక్కావు, అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే, ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదని ఎద్దేవా చేశారు. నీ ఘోర పరాజయానికి, రాజకీయ పతనానికి కారణాలు విశ్లేషించుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం, పాలనా పరిపక్వత ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేస్తే సహించం అని హెచ్చరించారు.

Next Story