వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రి నారాయణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇతర అధికారులు రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు. పీఎం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకునే మార్గాలను మంత్రి నారాయణ పరిశీలించారు. సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ నుంచి ప్రధాని ర్యాలీగా బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్లనున్నారు. ప్రజలు రాజధాని రైతులు ఇరువైపులా స్వాగతం పలకనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మే 2 తేదీన రాజధాని పనుల పునః ప్రారంబోత్సవానికి ప్రధాని మోడీ వస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు 5 వేల కోట్ల పనులు చేశాం. వైసీపీ 5 ఏళ్ల పాటు అమరావతి పనులు నిలిపివేసింది. 64 వేల కోట్ల టెండర్లకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదించింది. 41 వేల కోట్లు టెండర్లు పిలిచాం. టెండర్లు దగ్గించుకున్న సంస్థలకు పనులు అప్పగించాం. వైసీపీ అమరావతి టెండర్లపై తప్పుడు ప్రచారం చేస్తుంది..అని మంత్రి అన్నారు.
5 ఏళ్ల పాటు పనులు నిలిచి పోవడం, నిర్మాణ సామాగ్రి అయిన స్టీల్, ఇతర వస్తువుల ధరలు పెరగడం వలనే నిర్మాణ వ్యయం పెరిగింది. వైసీపీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా కాదు. అమరావతికి గతంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మళ్లీ ప్రధాని చేతుల మీదుగానే అమరావతి పనులు పునఃప్రారంభం అవుతాయి అని మంత్రి నారాయణ చెప్పారు.