ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై లాంగ్ విజన్‌తో సీఎం చంద్రబాబు ఉన్నారు. అమరావతిలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. రైతుల భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే అదనపు భూమి అవసరం.. అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. ఇప్పటికే భూములు ఇచ్చిన వాటి విలువ పెరగడం కోసం మరికొంత భూమి అవసరం..అని పేర్కొన్నారు.
భూములు ఇచ్చిన వారి ధర పడిపోతుందని రైతులకు సందేహం కలగొచ్చు. ఒక ఏడాదిలోపే ఉద్యోగుల భవనాలు, ట్రంక్ రోడ్లు పూర్తవుతాయి. అమరావతిలో విమానాశ్రయం రావాలి. అన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధికి అదనపు భూములు అవసరం. ప్రస్తుతం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూముల ధర ఇంకా పెరుగుతుంది. పరిశ్రమలు, ఎయిర్ పోర్టు నిర్మాణానికి మరికొన్ని ఎకరాలు కావాలి.. అని మంత్రి నారాయణ చెప్పారు.