ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం.. ఆ రాష్ట్ర ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. మరోవైపు ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం మంత్రి కొడాలి నాని.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. మరో వైపు కొడాలి నాని మిత్రుడు, టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు కరోనా సోకింది. మొద స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన కూడా చికిత్స కోసం ఏఐజీలో చేరారు. ఈ నెల 9వ తేదీన కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు వంగవీటి రాధా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 36,452 పరీక్షలు నిర్వహించగా.. 1,831 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,84,674కి చేరింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,505గా ఉంది. 24 గంటల వ్యవధిలో 242 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,62,974కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,195 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,16,66,683 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.