ఏబీఎన్, ఆంధ్రజ్యోతి (పత్రిక), ఈనాడు (పత్రిక), ఈటీవీ, టీవీ5ను ఈ రోజు నుంచి పూర్తిగా నిషేధిస్తున్నామని మంత్రి కొడాలి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నాలుగింటిని నిషేధించాలని వైసీపీ నేతలకు సూచించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య కథనాలు రాస్తున్నారని.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రచురిస్తూ రామోజీరావు దిగజారిపోయారన్నారు.
ఈనాడు, ఈటీవీ, టీవీ5, ఎబీఎన్ ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నామన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే మీడియాను దూరం పెడుతున్నాం. సీఎం జగన్ పాలన ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడే సీఎం జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని.. రాష్ట్రం ముక్కలవ్వడానికి చంద్రబాబు ప్రధాన కారకుడని కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యక్రమాలు, మీడియా సమావేశాలు, ఇంటర్వూలకు సదరు మీడియా సంస్థలను పిలవద్దని కొడాలి నాని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ అధికార ప్రతినిధులు, వైసీపీ నాయకులు ఈ పత్రికలు, ఛానళ్ల వాళ్లతో మాట్లాడవద్దని అన్నారు.