జీఓ 107,108తో ఏపీ మెడికల్ విద్యార్థులకు తీరని అన్యాయం
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ప్రతి సభలో ప్రసంగములో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల అభ్యున్నతికి, శ్రేయస్సుకు కట్టుబడి వుంటాను అని విపక్ష హోదాలోను, అధికారంలోకి వచ్చిన తరువాత వైస్సార్సీపీ పార్టీ అధినేత వై.ఎస్ జగన్ అనేక వాగ్దానాలు ఇచ్చినారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Sep 2024 2:42 PM GMTనా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ప్రతి సభలో ప్రసంగములో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల అభ్యున్నతికి, శ్రేయస్సుకు కట్టుబడి వుంటాను అని విపక్ష హోదాలోను, అధికారంలోకి వచ్చిన తరువాత వైస్సార్సీపీ పార్టీ అధినేత వై.ఎస్ జగన్ అనేక వాగ్దానాలు ఇచ్చినారు.
మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లల్ని మీరు ఇంజనీరింగ్ చదివిస్తారో, డాక్టర్ చదివిస్తారో, విదేశాలకు పంపి చదివిస్తారో మీ ఇష్టం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఉచితంగా ఉన్నత విద్య అందిస్తాం - ఇలాంటి వాగ్దానాలు జగన్ ఎన్నో సభలలో చెప్పటం జరిగింది.
జగన్ ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధముగా అధికారంలోకి వచ్చిన తరువాత 2023 సంవత్సరం జులై 19 న ఇచ్చిన G OMs No 107, 108 ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసించాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన వారికి, పేద విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారు. 2023వ సంవత్సరము తర్వాత కొత్తగా స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ GO అమలు చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు
జగన్ ప్రభుత్వ హయాములో తీసుకుని వచ్చిన GO 107, 108 వలన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటాలో విద్యార్థులకు కేటాయించవలసిన సీట్స్ లలో సగభాగం అనగా 50 % సీట్స్ ని సెల్ఫ్ ఫైనాన్స్ (35%) , NRI కేటగిరీ లకు (15%) కేటాయించి సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సీట్లకు రూ.12 లక్షలు, NRI కేటగిరీ సీట్లకు రూ.20 లక్షలు ఫీజులు పెట్టారు. ఈ రెండు కేటగిరీలలో రిజర్వేషన్ పాలసీ వర్తించదు. కన్వీనర్ కోటాలో జనరల్ కేటగిరీ కి సంవత్సరానికి ఫీజు 15 వేల రూపాయలు. కన్వీనర్ కోటా ఏ కేటగిరీలో రిజర్వేషన్లను అనుసరించి ప్రతిభ ఉన్న వారితో భర్తీ చేయాల్సి ఉంది. కన్వీనర్ కోటాలో కేటాయించవలసిన సీట్స్ లలో సగభాగం 50 % సీట్స్ ని NRI సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సీట్స్ కి బదలాయించడం వలన మెరిట్ మరియు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. వారు కన్వీనర్ కోటాలో పొందవలసిన సీట్స్ ని కోల్పోతున్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసించాలి అని ఆశిస్తున్న విద్యార్థులకు ఈ GO 107 108 వలన జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసి, ఈ GO లను రద్దుచేయాలి అని వారు గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో Writ Petition వేయడం జరిగింది. విద్యార్థులు వేసిన పిటిషన్ WP/20137/2023, WP/20384/2023. ఈ కేసులు ప్రస్తుతం విచారణలో వున్నవి.
విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం విషయమై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బాక్క్వర్డ్ క్లాస్సేస్ మరియు మినిస్ట్రీ అఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారికి రెప్రెసెంటేషన్స్ ఇచ్చి ప్రభుత్వ కళాశాలలలొ వైద్య విద్య చదువుకోవాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయవలసినదిగా కోరడమైనది.
వైద్య విద్యార్థులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తీవ్రంగా ఖండించి ఈ GO లను రద్దు చేయవలసినదిగా అనేక ఉద్యమాలు చేసాయి.
ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడిన తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కళాశాలలలొ వైద్య విద్య చదువుకోవాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న గత ప్రభుత్వం ఇచ్చిన GO 107, 108 లను తమ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో రద్దు చేస్తామని నారా లోకేష్ యువగళం కార్యక్రమంలో (2023 ఆగస్టు 16న మంగళగిరిలో) విద్యార్థులకు వాగ్దానం చేశారు.
అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కృష్ణా జిల్లా పెడనలో జరిగిన ఎన్నికల సభలో (2023 అక్టోబర్ 4వ తేదీన) GO 107, 108 వలన వైద్య విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత GO 107 108 రద్దు చేయాలి అని విద్యార్థులు వేసిన పిటిషన్ WP/20137/2023, WP/20384/2023 విచారణ సందర్భముగా (2024 జూలై 12వ తేదీన) కూటమి ప్రభుత్వం గత జగన్ప్ర భుత్వములో ఇచ్చిన GO లను కొనసాగిస్తాము, వీటిని రద్దు చేసే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని హై కోర్ట్ కు తెలియచేసారు.
2024 ఆగష్టు 7వ తేదీన జరిగిన కూటమి క్యాబినెట్ మీటింగ్ లో GO 107 108 రద్దు చేయాలి అనే విషయం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను, నియోజకవర్గం లో వున్న ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రైవేట్ పరం చేసేలా ప్రభుత్వ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్ (Public–private partnership PPP) అంశంను తెరపైకి తెచ్చి గుజరాత్ వెళ్లి ప్రభుత్వ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్ అధ్యయనం చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రములో వున్న 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీ లలో మాత్రమే ప్రభుత్వ కోటాలో అందుబాటులో వున్న సీట్స్ కి ఫీజు 25 వేల రూపాయలు మాత్రమే వుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) గుజరాత్ మోడల్ లో ఎయిడెడ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీ లలో (SFI - సెల్ఫ్ ఫైనాన్సుడ్ ఇన్స్టిట్యూట్) కేటగిరి కోటా A లో ఎవరైనా మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంబీబీఎస్ సీటు సాధిస్తే సంవత్సరానికి ₹ 5.50 లక్షల నుంచి ₹8 లక్షల వరకూ ఫీజు కట్టాలి. మేనేజ్మెంట్ కేటగిరి కోటా B లో సంవత్సరానికి ₹15.75 లక్షల నుంచి ₹17లక్షలు, NRI కోటా కేటగిరి C లో సంవత్సరానికి ₹20 లక్షల నుంచి 25 లక్షల ఫీజు ఏడాదికి కట్టాలి.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) గుజరాత్ మోడల్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అమలు చేస్తే మన రాష్ట్రములో ఎంతమంది ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ ఫీజు లు కట్టే స్తొమత ఉంటుందో కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఫీజు రీయింబర్సుమెంట్, రిజర్వేషన్ పాలసీ లు వర్తించని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్ ఎలా ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులుకు మేలు చేస్తుందో కూడా ప్రభుత్వం పునరాలోచించాలి.
ఇది ఇలా ఉండగా GO 107, 108 వలన విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం విషయమై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో 2024 ఆగష్టు నెల 6 వ తేదీన జరిగిన హియరింగ్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు పాల్గొనడం జరిగింది. గిరిజన తెగల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పరిశీలించారు.
హియరింగ్ సారాంశం:
1) రీసెర్వ్డ్ మరియు మెరిట్ స్టూడెంట్స్ కు జరుగుతన్న అన్యాయం : GO 107, 108 వలన కొత్తగా అనుమతి ఇచ్చిన 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటాలో 320 సీట్స్ తగ్గిపోతున్నవి.
2) ఫీజు విధానం : సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సీట్లకు రూ.12 లక్షలు, NRI కేటగిరీ సీట్లకు రూ.20 లక్షలు ఫీజులు వసూలు చేయడం వలన సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన SC ST వర్గాల విద్యార్థులుకు ఆర్థికంగా భారం అవడమే కాకుండా వారు తీవ్రంగా ప్రభావితం అవుతారు.
3) సామజిక న్యాయం / సాధికారతకు సంబంధించి అంశం : GO 107, 108 వలన కన్వీనర్ కోటాలో కేటాయించవలసిన సీట్స్ లలో సగభాగం 50 % సీట్స్ ని NRI సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సీట్స్ కి బదలాయించడం వలన 206 మెడికల్ సీట్స్ షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు, 83 మెడికల్ సీట్స్ షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు కోల్పోతున్నారు.
రిజర్వేషన్ పాలసీ కి వ్యతిరేకముగా GO 107, 108 వలన వైద్య విద్యకు దూరం అవుతున్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ GO లను అమలు చేసే విషయములో పునరాలోచించవలసినదిగా కోరారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చేసిన సూచనలపై నెల రోజుల లోపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో ఆ రిపోర్ట్ ని కమిషన్ కు పంపించమని కోరడం జరిగింది
కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ వారి Centrally Sponsored Scheme (CSS) లో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించే అవకాశం ఉండగా వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద నిర్దేశిత ప్రాజెక్టు వ్యయంలో 30% నుంచి 40% కేంద్ర ప్రభుత్వం, మరో 30% వరకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి మిగిలిన మొత్తాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానంలో ముందుకొచ్చే ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెట్టి ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహణ, విద్యార్థుల చదువును ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు భావ్యం?
ప్రభుత్వ కళాశాలలలొ వైద్య విద్య చదువుకోవాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత జగన్ ప్రభుత్వం అయినా ఇప్పటి కూటమి ప్రభుత్వం అయినా ఇద్దరూ తీరని అన్యాయం చేస్తున్నారు.
GO 107,108 వలన జరిగే అన్యాయం కంటే ఆరోగ్య విద్య, వైద్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) వలన ఇంకా ఎన్నో రెట్ల అన్యాయం ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు జరుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుకు సహకారం అందించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండగా ఉండగా రాష్ట్ర అభివృద్ధికి విరివిగా నిధులు పొందే అవకాశం వున్నప్పుడు దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్య విద్య, వైద్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానాన్ని విరమించుకోవలసినదిగా విజ్ఞప్తి.
నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి Letter Of Permission (LOP) కోసం ఎదురు చూస్తున్న మార్కాపురం, పాడేరు, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీ లకు కావలసిన అనుమతులు త్వరితగతిన సాధించి అలాగే నూతనముగా కట్టబోయే ప్రభుత్వ మెడికల్ కాలేజీ లకు Centrally Sponsored Scheme (CSS) ద్వారా నిధులు సాదించవలసినదిగా విజ్ఞప్తి.
కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో గత ప్రభుత్వం ఇచ్చిన GO 107, 108 రద్దు చేస్తాము అన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసించాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన వారికి, పేద విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు న్యాయం చేయవలసినదిగా విజ్ఞప్తి.