ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు శుక్రవారం ముగిశాయి.
By - Medi Samrat |
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు శుక్రవారం ముగిశాయి. విద్య, ఉద్యోగ నియామకాలు, వ్యవసాయం వంటి కీలక రంగాలకు సంబంధించిన ఆరు ముఖ్యమైన బిల్లులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం, ఛైర్మన్ మోషేన్ రాజు మండలిని నిరవధికంగా వాయిదా వేశారు.
అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు మండలి ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం, ఏపీ వర్సిటీల సవరణ బిల్లులకు కూడా సభ ఆమోదం లభించింది. ఈ చట్టాల ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల పర్యవేక్షణ మరింత పటిష్టం కానుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లు కూడా ఆమోదం పొందింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వేతనాల చెల్లింపులో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యం. ఈ చట్ట సవరణలో భాగంగా, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించే ప్రతిపాదనకు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ, ఆర్థిక రంగాలకు సంబంధించి కూడా మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చే ప్రక్రియను సరళతరం చేసే బిల్లుకు ఆమోదం లభించింది. అదేవిధంగా, ఏపీ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లు-2025ను కూడా సభ ఆమోదించింది.