ఆ కేసులో తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు : హోం మంత్రి అనిత
మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు తీసుకొస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు
By Medi Samrat Published on 26 Sep 2024 9:09 AM GMTమానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు తీసుకొస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడ నోవటెల్ హోటల్ వేదికగా మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు అరికట్టేందుకు మేధావులతో జరిగిన జాతీయ సదస్సు అనంతరం మీడియాతో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. రెండు రోజుల సదస్సులో న్యాయవాదులు, సామాజికవేత్తల విలువైన సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.
చిన్నారులు, మహిళల రక్షణే మా మొదటి ప్రాధాన్యత అన్నారు. టెక్నాలజీ, శిక్షణ కలిగిన వారిని నియమించి హ్యుమన్ ట్రాఫికింగ్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆకర్షించే సందేశాలతో వలేసి అమాయకుల డబ్బు కాజేస్తున్నారని అన్నారు.
కాదంబరి జెత్వాని కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతోందని.. ముంబయి నటి కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశామని తెలిపారు. కేసులో తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తేలేదని.. కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామన్నారు. విచారణ తర్వాత కొంతమంది పోలీసులపై చర్యలు ఉంటాయని తెలిపారు. కేసును సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారని.. కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేసే మాఫియాల పని పడతామన్నారు.
ప్రజలు, మహిళల అవగాహన కోసం ప్రభుత్వం సదస్సులు నిర్వహిస్తుందని.. సైబర్ హ్యూమన్ ట్రాఫికింగ్‌పై చర్చ జరగాలన్నారు. సైబర్ హ్యూమన్ ట్రాఫికింగ్‌ను అరికట్టేందుకు ఎన్జీవోలు, సామాజిక సంస్థలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజలు, మహిళల అప్రమత్తతే సైబర్ నేరాలు అరికట్టడంలో కీలకం అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ను సకల వసతులతో ఫోరెన్సిక్ యూనివర్శిటీలా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్నారు.