ముందు వెనక కట్ చేసి వ్యాఖ్యలను ప్రసారం చేయడం సరికాదు : హోం మంత్రి

AP Home Minister Taneti Vanitha Press Meet. దేవరపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో హోం శాఖ మంత్రి తానేటి వనిత

By Medi Samrat  Published on  1 May 2022 5:48 PM IST
ముందు వెనక కట్ చేసి వ్యాఖ్యలను ప్రసారం చేయడం సరికాదు : హోం మంత్రి

దేవరపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో హోం శాఖ మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, ఇతర వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. జి.కొత్తపల్లిలో జరిగిన గంజి ప్రసాద్ హత్య సంఘటన దురదృష్టకరమ‌ని అన్నారు. వైసీపీ నేత గంజి ప్రసాద్ కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తామ‌ని తెలిపారు.

ఈ రోజు బాధిత కుటుంబసభ్యులను జి.కొత్తపల్లి లో పరామర్శించడం జరిగిందని.. హత్యకు గురైన గంజి ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. హత్య కేసులో కొంతమంది వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారని తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో బజారయ్య అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారని వెల్ల‌డించారు. బజారయ్య కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారని.. సంఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు.

దిశా యాప్ ఉపయోగించుకోలేని చిన్నారుల భద్రత విషయం తల్లి చూసుకోవాలని మాత్రమే నేను చెప్పానని.. ముందు వెనక కట్ చేసి వ్యాఖ్యలను ప్రసారం చేయడం సరికాదని అంత‌కుముందు తాను మాట్లాడిన మాట‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు హోంమంత్రి తానేటి వ‌నిత‌. ఎవరు పదవికి పనికి వస్తారో తేల్చాల్సింది ప్రజలని.. ఇప్పటికైనా టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆడపిల్లలలపై అఘాయిత్యాలు జరగకుండా తల్లులే జాగ్రత్తపడాలని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వ‌నిత‌ కోరారు. విశాఖపట్టణంలోని దిశ పోలీస్ స్టేషన్‌ను ఏపీ హోంమంత్రి తానేటి వనిత శనివారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యతను తల్లి చూసుకుంటుందన్నారు. తల్లి కూడా ఉద్యోగం కోసమో, కూలి పనుల కోసమో బయటకు వెళ్తుండడంతో పిల్లలు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతున్నారని అన్నారు. దీనిని అలుసుగా తీసుకుని ఇరుగుపొరుగువారు, బంధువులు, కొన్ని చోట్ల తండ్రులే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమన్నారు. మహిళా పక్షపాతి అయినా తమ ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు.

పనులకు వెళ్లిన కారణంగా పిల్లలను తాము రోజంతా చూసే సమయం దొరకదని కొందరు తల్లులు చెప్పే పరిస్థితి తన దృష్టికి వచ్చిందన్నారరు. ఆడపిల్లల విషయంలో తండ్రి కంటే తల్లికే ఎక్కువ బాధ్యత ఉంటుందని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.తల్లిగా మనకు మనం సంరక్షణ ఇస్తూ పిల్లలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తు పిల్లలపై ఏదైనా అఘాయిత్యం జరిగితే న్యాయం జరగాలని పోరాటం చేస్తామన్నారు. తల్లి పాత్ర పోషించకుండా పోలీసులపైనో, ప్రభుత్వంపైనో నిందలు వేయడం సరైంది కాదన్నారు. తల్లిగా మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాలని హోం మంత్రి వనిత కోరారు.





















Next Story