శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ట్రస్ట్ బోర్డు నియామకాన్ని సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మకర్తల మండలి ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఆదివాసీ చరిత్ర కలిగిన ఆలయంలో గిరిజనుల ప్రాతినిధ్యం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇద్దరు హిందూ తత్వవేత్తలు ఉండాలనే నిబంధనను ఉల్లంఘించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆలయంపై అవగాహన లేని సభ్యులను ట్రస్టు సభ్యులుగా నియమించారని మండిపడ్డారు. వాదనల అనంతరం బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు మూడు వారాల పాటు నిలిపివేసి తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ట్రస్టుబోర్డులో 15 మందిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న ట్రస్టు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.