అంగన్‌వాడీ వర్కర్ల పదోన్నతిపై.. ఏపీ హైకోర్టు స్టే
AP High Court stays on promotion of Anganwadi workers. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే
By అంజి Published on 30 Sept 2022 11:07 AM ISTమహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను అర్హులైన కాంట్రాక్టు కార్మికులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్ల నుంచి భర్తీ చేయాల్సి ఉంది. పోస్టులకు అర్హత డిగ్రీ. సెప్టెంబర్ 18న 38 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు రాత పరీక్షకు హాజరయ్యారు. అనంతరం మౌఖిక పరీక్ష నిర్వహించారు.
రాత పరీక్షకు 45 మార్కులు, మౌఖిక పరీక్షకు ఐదు మార్కులు. అయితే ఈ పోస్టుల భర్తీలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, తక్షణమే పరీక్షా ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటీషన్ దాఖలైంది. జీవో ప్రకారం.. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌లను నియమించేటప్పుడు రాత పరీక్షలతో పాటు ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్షలను నిర్వహించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనను ప్రభుత్వ అధికారులు ఉల్లంఘించారని, మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని ఎంపిక చేస్తున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపించారు.
పదోన్నతుల ప్రక్రియను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ముందుగానే పోస్టుల భర్తీకి మాట్లాడుకొని డబ్బులు వసూలు చేశారు. ఒక్కో పోస్టుకు సుమారు రూ.10 లక్షలు వసూలు చేశారని ఆరోపించడంతో పాటు, ముందుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటీషన్ల బ్యాచ్‌ను విచారించిన జస్టిస్ కె. మన్మధరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై స్టే విధించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.