ఆనందయ్య మందు.. విచారణ 3 గంటలకు వాయిదా.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ‌

AP High court inquiry on anandaiah medicine.కృష్ణ‌ప‌ట్నం ఆనందయ్య మందు పంపిణీపై విచార‌ణ‌ను ఏపీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2021 8:17 AM GMT
ఆనందయ్య మందు.. విచారణ 3 గంటలకు వాయిదా.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ‌

కృష్ణ‌ప‌ట్నం ఆనందయ్య మందు పంపిణీపై విచార‌ణ‌ను ఏపీ హైకోర్టు మ‌ధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఆనంద‌య్య మందును ప్ర‌భుత్వ‌మే పంపిణీ చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. నాలుగు రోజులు స‌మ‌య‌మిచ్చినా పంపిణీ వివ‌రాలు ఎందుకు స‌మ‌ర్పించ‌లేద‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. మందు పంపిణీకి సంబంధించి చేపట్టిన చర్యల వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్ర‌భుత్వం చెబుతున్న అభ్యంతరాలను ఈ సంద‌ర్భంగా కోర్టు తోసిపుచ్చింది.

ఆనందయ్య మందుపై ప్ర‌భుత్వం కాసేప‌ట్లో స‌మీక్ష జరుపుతోందని ప్ర‌భుత్వ న్యాయవాది కోర్టుకి తెలిపారు. ప్ర‌భుత్వ స‌మీక్ష త‌ర్వాత నిర్ణ‌యం త‌మ‌కు తెలపాల‌ని ఆదేశించిన న్యాయ‌స్థానం.. మ‌ధ్యాహ్నం తీర్పు వెల్ల‌డిస్తామ‌ని చెప్పింది. విచారణను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వాయిదా వేసింది.

మ‌రోవైపు.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేద‌ని ఆనందయ్య తరపున న్యాయవాది అశ్వని కుమార్ వాదించారు. ఫార్మా కంపెనీల‌ ఒత్తిడి వల్ల మందు పంపిణీని అడ్డుకుంటున్నారన్న ఆయ‌న‌.. చట్ట ప్రకారం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేద‌న్నారు. రాజ్యాంగం ప్రకారం ఈ మందు పంపిణీ చేసే హక్కు ఉందన్న ఆనందయ్య న్యాయవాది.. వంశపారపర్యం నుంచి ఇది చేస్తున్నార‌ని హైకోర్టుకు తెలిపారు. మ‌ధ్యాహ్నం విచార‌ణ ఎలా సాగుతోంది.. హైకోర్టు తీర్పు ఎలా ఉండ‌బోతోంది? అనే దానిపై స‌ర్వ‌త్ర ఉత్కంఠ నెల‌కొంది.

Next Story