ఏపీ హైకోర్టు.. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై 25న కౌంటింగ్ ను నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలావుంటే.. మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, కోవిడ్ జాగ్రత్తల మధ్య జరిగిన ఎన్నికలో 56.86% పోలింగ్ నమోదైంది. అయితే, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ.. సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు.
దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించుకోవడానికి అనుమతిచ్చింది.
కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది ఎన్నికల కమిషన్. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుంటే.. ఏలూరు కార్పొరేషన్ లో 50 డివిజన్లున్నాయి. వీటిలో మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకొంది. 47 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.