వాలంటీర్లను తొలగిస్తున్నార‌న్న‌ వార్తల్లో నిజం లేదన్న ప్రభుత్వం

AP Grama Volunteer. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగిస్తోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  9 Dec 2020 12:57 PM GMT
వాలంటీర్లను తొలగిస్తున్నార‌న్న‌ వార్తల్లో నిజం లేదన్న ప్రభుత్వం

35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగిస్తోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా 35 సంవత్సరాల పైన వయసు ఉన్న వ్యక్తులను తొలగించడం వలన కొన్ని వందల మంది రోడ్డు మీద పడే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్ కుమార్ ఖండించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు.

నిబంధనలకు విరుద్ధంగా ఆరుగురు ఎంపికయ్యారని వీరిని తొలగించడానికి చేపట్టిన చర్యలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఆరుగురిని తప్ప మరెవరినీ తొలగించడం లేదని అన్నారు. ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీని ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉండే వాలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు నవీన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2.60 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తుండగా... 7,120 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 5,154 గ్రామ వాలంటీర్ పోస్టులు ఉన్నాయి. మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తమ పరిధిలో ఏర్పడే ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని ఉత్తర్వులు జారీ చేశారు. 35 సంవత్సరాల వయసు పైబడిన వారిని తొలగించలేదని తెలియడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.


Next Story
Share it