రేపటి నుండి సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులు

AP Grama Sachivalayam Employees. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపటి

By Medi Samrat  Published on  21 July 2021 8:49 AM GMT
రేపటి నుండి సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపటి నుంచి పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం.. కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులంతా సమయానికి విధులకు హాజరు కావాల్సిందే అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఇప్పటి వరకు అవలంభించిన రిజస్టర్ సంతకం విధానానికి స్వస్తి పలికింది.

రేపటి నుంచి అన్ని సచివాలయాల్లో బయో మెట్రిక్‌ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతి ఉద్యోగి ఆఫీసుకు వచ్చి, వెళ్లే సమయాల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ లో నమోదు చేయాల్సిందే. అలాగే ఇకపై ప్రతి ఉద్యోగి కూడా వారి వారి సచివాలయం పరిధిలోనే నివసించాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వారు ఎక్కడ ఉండేది.. పంచాయతీ అధికారికి తెలియజేయాలని.. అలాగే.. సచివాలయ ఉద్యోగి పూర్తి చిరునామా, వివరాలను అయా కార్యాలయాల్లో అందరికీ అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించింది.

ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కూడా ఆయా జిల్లాల వారీగా ఆదేశాలు జారీ చేసింది పంచయతీ రాజ్ శాఖ. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యంగా ఉన్నా.. సకాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించకున్నా కూడా సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో సూచించింది. రేపటి నుంచి ప్రతి సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ కూడా వారి వారి పరిధిలోని సచివాలయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలని ఆదేశించింది.

ఎక్కడైనా సాంకేతిక లోపం వస్తే.. వెంటనే సంబంధిత అధికారికి చెప్పాలని సూచించింది. జులై నెల జీతం బయోమెట్రిక్ తో లింక్ అయి వస్తుందని.. ఎన్నిరోజులు హాజరు ఉంటే అన్ని రోజులకే జీతం వస్తుందన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి ఎల్ఎంఎస్ ద్వారా ట్రైనింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం సీబీఏఎస్ మార్కులను అనుసంధానం చేస్తామన్నారు. వ్యవస్థ ప్రారంభించి రెండేళ్లు పూర్తికావస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ పీరియడ్ లోకి రానున్నారు.




Next Story