రేపు జగనన్న విద్యా దీవెన నాలుగో విడత పంపిణీ

AP govt to disburse fourth tranche of Jagananna Vidya Deevena tomorrow. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా నాల్గవ విడత నిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం

By అంజి  Published on  29 Nov 2022 5:30 PM IST
రేపు జగనన్న విద్యా దీవెన నాలుగో విడత పంపిణీ

జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా నాల్గవ విడత నిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం (నవంబర్ 30) విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 10.85 లక్షల మంది విద్యార్థులకు మొత్తం రూ.709 కోట్లు జగన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీ, కాపు, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయబడతాయి.

ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. నిజానికి వైఎస్ జగన్ బహిరంగ సభ ఈ నెల 25న జరగాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. 24, 25 తేదీల్లో తుపాను ప్రభావంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మదనపల్లె పర్యటనను 30వ తేదీకి వాయిదా వేశారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.

పథకంలో భాగంగా ప్రభుత్వం ఐటీఐ విద్యార్థులకు రెండు విడతలుగా రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రూ.20వేలు విడుదల చేస్తున్నారు.

Next Story