27న‌ జరిగే భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ మద్దతు.!

AP Govt Support Bharat Bandh. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు

By Medi Samrat  Published on  25 Sep 2021 1:33 PM GMT
27న‌ జరిగే భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ మద్దతు.!

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన మచిలీపట్నంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయరంగాన్ని ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుందని గత కొన్ని రోజులుగా కిసాన్ మోర్చా పేరుతో రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళన అందరికి తెలిసిందేనని అన్నారు.

వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రయత్నాన్నీ విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం మద్దతు ప్రకటించిందని 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తూ బంద్ కు మద్దతును తెలియచేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు తిరగని విషయాన్నీ రాష్ట్రంలోని ప్రజలు గమనించాలని అన్నారు. 27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి యధావిధిగా బస్సులు తిరుగుతాయని అన్నారు. విశాఖ ఉక్కును ప్రవేటీకరిస్తూ కార్పొరేట్ రంగానికి విక్రయించవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. బంద్ లో పాల్గొన్న ప్రజలు శాంతియుతంగా తమ నిరసనను తెలియచేయాలని మంత్రి పేర్ని నాని సూచించారు.


Next Story
Share it