అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం
AP govt. signs MoU with Amul to distribute milk, Balamrutham to Anganwadi centres. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న 'అమూల్' సంస్థ ద్వారా ఏపీలో పాలు, బాలామృతాన్ని
By Medi Samrat Published on 28 Jan 2022 4:49 PM IST
అంతర్జాతీయంగా పేరెన్నికగన్న 'అమూల్' సంస్థ ద్వారా ఏపీలో పాలు, బాలామృతాన్ని రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అమూల్‌తో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అనే మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇప్పటికే ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోందని, అనంతపురం జిల్లాలో కొత్తగా ప్రారంభించడం అనంతపురం జిల్లాకు శుభవార్త అని అన్నారు.
ఈ పథకం ద్వారా పాడి రైతుకు రూ.5 నుంచి రూ. 20 అదనపు ఆదాయం వస్తోందని, రాష్ట్రంలో ప్రభుత్వం బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందని.. అమూల్ తర్వాత ప్రైవేట్ కంపెనీలు రేట్లు పెంచాల్సి వచ్చిందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. పాల సేకరణలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. గర్భిణులకు 200 గ్రాముల పౌష్టికాహారం.. పిల్లలకు రోజుకు 100 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు.. అంగన్‌వాడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ బెంగళూరు నుండి టెట్రా ప్యాకింగ్ రూపంలో నెలకు 1.07 కోట్ల లీటర్ల చొప్పున సంవత్సరానికి 12.84 కోట్ల లీటర్ల పాలను.. తెలంగాణ స్టేట్ ఫుడ్ సొసైటీ నుండి సంవత్సరానికి 48,692 మెట్రిక్ టన్నుల బాలామృతం సరఫరా చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు పాలపై రూ. శిశు మరణాలపై 265 కోట్లు ఖర్చుచేయనుందని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. 22.50 లక్షల మంది ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు.. 7.50 లక్షల మంది గర్భిణులు ఉన్నారు. రాష్ట్రంలోని స్థానిక డెయిరీల నుంచి ఉత్పత్తి చేసే తాజా పాలతో పాటు రాష్ట్రంలోనే ప్రాసెస్ చేసిన బాలామృతం కూడా అంగన్‌వాడీ కేంద్రాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పాడి రైతులకు మేలు జరగడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.