కోవిడ్ తో ఎంతో మంది మరణిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే అంతిమ సంస్కారాల విషయంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి క్యూలో ఉండాల్సిన పరిస్థితి..! ఇంకొన్ని చోట్ల ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారో.. ఏ సమయానికి నిర్ణయిస్తారో తెలియని పరిస్థితులు. ఈ వార్తలను చదివి ప్రతి ఒక్కళ్లూ బాధపడుతూ ఉన్నారు. అంతిమ సంస్కారాలు కూడా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అవ్వడంతో చాలా మంది శవాలను కూడా వదిలేసి వెళ్ళిపోయిన ఘటనలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారు. కోవిడ్ తో చనిపోయిన వారి అంతిమ సంస్కారాలకు రూ. 15000 ఆర్థిక సాయం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు


సామ్రాట్

Next Story