కరోనా టెస్ట్‌లు చేయించుకునేవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా టెస్టుల ధరలను సగానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా టెస్టింగ్ ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా టెస్ట్ కిట్ల తయారీ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో కరోనా టెస్టింగ్ కిట్ల ధరలు తగ్గాయని జీవోలో పేర్కొంది. ప్రస్తుతం రూ. 1000గా ఉన్న కరోనా పరీక్ష ధరను రూ.499కి తగ్గించింది. వీటీఎం, పీపీఈ కిట్ తో కలిపి ఈ ధరను నిర్ణయించామని, తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
తమకు కరోనా ఉందన్న అనుమానం ఉన్నవారు పరీక్ష చేయించుకుంటే రూ. 499 మాత్రం చెల్లిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబ్ ల్లో మాత్రమే ఈ పరీక్షలు చేయాలన్నారు. ఇక ప్రభుత్వం తరఫున ప్రైవేటు ల్యాబ్ లకు శాంపిల్ వెళితే రూ. 475కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. సవరించిన ధరల పట్టికను అన్ని హాస్పిటల్స్, ల్యాబ్ లు బహిరంగంగా ప్రదర్శించాలని, తగ్గించిన ధరల అమలు బాధ్యత జిల్లాల డీఎంహెచ్వోలదేనని ఆయన అన్నారు.
ఏపీలో కరోనా కేసులు బాగా తగ్గాయి. కొత్త కేసులు చాలా తక్కువగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 8,76,336కి చేరాయి. కొత్తగా 5గురు కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,064కి చేరింది. 8,64,612 మంది కరోనా నుండి కోలుకోగా.. 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,09,37,377 మందికి కరోనా పరీక్షలు చేశారు.