తెలంగాణలో మాదిరిగానే.. ఏపీ కొత్త జిల్లాల్లో అన్ని ఒకే చోట ఉండేలా..
AP govt. plans to set up Integrated collectorates in new districts. కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
By Medi Samrat Published on 31 Jan 2022 10:32 AM ISTకొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని ప్రధాన జిల్లాల కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. దీని వల్ల భూమి అవసరంతో పాటు ఖర్చు కూడా బాగా తగ్గుతుందని అంచనా. తెలంగాణలో ఏర్పాటైన కొత్త జిల్లాల్లో పలు చోట్ల సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయగా.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. వాటన్నింటిని పరిశీలించి రాష్ట్ర పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా సమీకృత కలెక్టరేట్లను ఏవిధంగా ఏర్పాటు చేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో అన్ని సేవలు ఒకేచోట నుంచి అందజేస్తున్నారు. గ్రామ పరిపాలన వ్యవస్థ అంతా అక్కడ కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా కొత్త జిల్లాల్లో అన్ని పరిపాలనా విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు వందకుపైగా జిల్లా కేంద్రాల్లో డీఈవో, వ్యవసాయ జేడీ, సంక్షేమ శాఖల కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాలన్నీ వేరే చోట ఉన్నాయి. బ్రిటీష్ కాలంలో నిర్మించబడిన కలెక్టరేట్లు, కలెక్టర్ బంగ్లాలు, ఎస్పీ కార్యాలయాలు పెద్ద విస్తీర్ణంలో ఉన్నాయి. ఇదే తరహాలో కొత్త జిల్లాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తే.. మరిన్ని భూములు అవసరం అవుతాయి. నిర్మాణ వ్యయం కూడా భారీగానే ఉంటుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో భూ లభ్యత చాలా తక్కువగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తే భూ సమస్య ఉండదు. అధికారుల క్వార్టర్లు, సమావేశ గదులు, వాహనాల పార్కింగ్ అన్నీ ఒకే చోట ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 13 జిల్లా కేంద్రాలను మినహాయించి 13 కొత్త జిల్లా కేంద్రాల్లో ఈ కలెక్టరేట్ సముదాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో అవసరమైన భూమిని గుర్తించినట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సిఫార్సులు చేసేందుకు ఏర్పాటైన కమిటీల్లో రవాణాశాఖ, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ సమీకృత కలెక్టరేట్లపై సవివర నివేదిక ఇచ్చినట్లు సమాచారం.