లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

AP Govt Ministers visit to the family of martyr Saiteja. ఇటీవల హెలికాఫ్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మృతి చెందిన సైనికాధికారుల్లో

By Medi Samrat  Published on  11 Dec 2021 2:08 PM GMT
లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

ఇటీవల హెలికాఫ్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మృతి చెందిన సైనికాధికారుల్లో ఒకరైన ఏపీకి చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబాన్నిడిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌ లు పరామర్శించారు. శనివారం నాడు చిత్తూరుజిల్లా కూరబలకోట మండలం రేగడ లో సాయితేజ నివాసంలో ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్బంగా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆర్థిక సహాయంకు సంబంధించిన చెక్‌ను లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి అందచేశారు.

అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అమరవీరుడి కుటుంబానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం వైయస్ జగన్ ప్రత్యేకంగా తెలియచేశారు. అదే విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించి, వారికి ధైర్యం చెప్పామని అన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించిన వారి త్యాగాలకు వెలకట్టలేమని అన్నారు. ఆ కుటుంబాలకు ఏమిచ్చినా వారి త్యాగాలకు సాటిరావని అన్నారు. వారి కుటుంబాలకు ఎంత సహాయం చేస్తున్నాం, ఏంటీ అనేది ప్రచారం చేయవద్దని సీఎం వైయస్ జగన్ కోరినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రచారానికి దూరంగా ఉంటుందని, సైనికుల మరణాలకు పరిహారంగా ఇచ్చే ఆర్థిక సహాయానికి పబ్లిసిటీ అక్కరలేని సీఎం స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.

27ఏళ్ళ చిన్న వయస్సులోనే లాన్స్‌నాయక్ సాయితేజ ప్రాణాలను కోల్పోవడం బాధాకరమని అన్నారు. స్వర్గీయ సాయితేజ వీరమరణం పొందారని, దేశం యావత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరులను తలుచుకుని నివాళులు అర్పించిందని గుర్తు చేశారు. దు:ఖంతో ఉన్న సాయితేజ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగిందని, వారి పరిస్థితిని స్వయంగా చూసిన తరువాత ఆ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున అండగా నిలవడం, కుటుంబసభ్యులకు చేయూతను అందించే విషయాలపై సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ‌తామని అన్నారు. సాయితేజకు చిన్నపిల్లలు ఉన్నారని, వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. సాయితేజ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కుటుంబసభ్యులు కోరిన నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ‌తామని తెలిపారు.


Next Story