సినిమా టికెట్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా ప్రవర్తిస్తుంది. టికెట్ల పంపిణీ బాధ్యతను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎఫ్‌డీసీ)కు అప్పగించింది. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ ప్రకారం ఆన్‌లైన్ టికెట్స్‌పై జీవో 142ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ సినిమా టికెట్ల కోసం జీవో 142 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సినిమా టికెట్ల విక్రయాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఇకపై ఏ సినిమా టికెట్లు అయినా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మకాలు జరిపాలని ఈ జీవో ఉద్దేశం. రైల్వే రిజర్వేషన్ల ఐఆర్సీటీసీ విధానంలో ఆన్‌లైన్ మూవీ టికెట్ల బాధ్యతను APFDC(AP Film Development Corporation)కి అప్పగించింది. త్వరలోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వెళుతున్న సంగతి తెలిసిందే..! సినిమా టికెట్ల రేట్లను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జీవో 35ను జారీ చేయగా.. ఈ జీవోని సవాల్ చేస్తూ కొన్ని థియేటర్ల యజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జీవో 35ను రద్దు చేసింది. పాత పద్దతిలోనే టికెట్ ధరలను నిర్ణయించుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ జడ్జి ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. చిత్ర నిర్మాతలు మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన రేట్లతో లాభాలు రావడం కష్టమేనని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో భారీ సినిమాలు విడుదల అవుతూ ఉండగా.. ఏపీ ప్రభుత్వం కనికరిస్తుందని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు ఎదురుచూస్తూ ఉన్నారు.