'ఆల్‌ పాస్‌'పై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు.. గ్రేడింగ్ ఎలాగంటే..

AP Govt Key Decision On 10th Results. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పలు క్లాసులు చదువుతున్న విద్యార్థులను ఆల్ పాస్ చేస్తున్నాయి

By Medi Samrat  Published on  12 July 2021 6:32 AM GMT
ఆల్‌ పాస్‌పై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు.. గ్రేడింగ్ ఎలాగంటే..

కరోనా కారణంగా గత రెండేళ్లుగా పలు క్లాసులు చదువుతున్న విద్యార్థులను ఆల్ పాస్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. గతేడాది కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేక రాష్ట్ర విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. వారి ధ్రువపత్రాల్లో సబ్జెక్టులకు గ్రేడ్లు బదులు పాస్‌ అని మాత్రమే ఇచ్చారు. దీంతో వారి ఉన్నత చదువులకు ఇబ్బందులేర్పడ్డాయి. పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా 'ఆల్‌ పాస్‌'కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది.

కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019–20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల 'ఆల్‌ పాస్‌'గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. విద్యార్థులు రాసిన సమ్మేటివ్, ఫార్మేటివ్‌ పరీక్షల మార్కుల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇవ్వనున్నారు. గత విద్యా సంవత్సరం విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించాలని విద్యా శాఖ నిర్ణయించింది. దీనిపై ఛాయారతన్‌(రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి) నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ చర్చించింది. 2019–20 విద్యార్థులకు ఫార్మేటివ్‌–1, ఫార్మేటివ్‌–2, ఫార్మేటివ్‌–3, సమ్మేటివ్‌–1 పరీక్షలు జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని వారికి ఇప్పుడు గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఒక్కో ఫార్మేటివ్‌ పరీక్షకు 20 మార్కులు చొప్పున 60 మార్కులుగా, సమ్మేటివ్‌ పరీక్షకు 40 మార్కులుగా పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఇందులో వీరికి కూడా ఎక్కువ మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల సగటును తీసుకొని పబ్లిక్‌ పరీక్షల గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు.

2020–21 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు కేవలం 2 ఫార్మేటివ్‌ పరీక్షలు మాత్రమే జరిగాయి. ఆయా విద్యార్థులు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని పదో తరగతి ఫలితాలు ప్రకటించాలన్న అంశంపై కమిటీ దృష్టి సారించింది. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఫార్మేటివ్‌ 1, ఫార్మేటివ్‌ 2 పరీక్షలు జరిగాయి. ఈ ఫార్మేటివ్‌ పరీక్షలు ఒక్కో దానికి 50 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులను గ్రేడ్ల కోసం పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల మార్కులను సగటుగా తీసుకొని గ్రేడింగ్‌ ఇస్తారు.


Next Story