రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నిర్ణయం జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ఆర్డినెన్స్ ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం సంతకం చేశారు. పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ఇటీవల మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం సంతకం చేశారు. ఇదిలావుంటే.. పీఆర్సీపై ఉద్యోగుల సంఘాలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకురానుంది.
కొత్త పీఆర్సీ ద్వారానే జీతాలు చెల్లిస్తామని సోమవారం ఉద్యోగులతో చర్చించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ గళం విప్పింది. మరోవైపు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ అధికారులు, ఇద్దరు ఏటీఓలు సహా మొత్తం 27 మందికి మెమోలు జారీ చేశారు. జీతాల బిల్లుల తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రెజరీ ఉద్యోగులకు అధికారులు మెమోలు కూడా జారీ చేశారు.