కరోనా మహమ్మారికి కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. కళ్లలో వేసే డ్రాప్స్ కు తప్పా.. మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
ఆ నివేదిక రావడానికి మరో 2–3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం తెలియజేసింది. దీంతో ఆనందయ్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక కంట్లో వేసే 'కే' రకం మందు అనుమతికై వేచిచూడాల్సిన పరిస్థితి.
ఇదిలావుంటే.. ఆనందయ్య మందును తీసుకునేందుకు కొవిడ్ రోగులు కృష్ణపట్నం రావొద్దని ప్రభుత్వం సూచించింది. రోగుల బదులు వారి కుటుంబ సభ్యులు వచ్చి మందును తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తిని నివారించవచ్చని సూచించింది. అయితే.. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులను ఆపొద్దని కోరింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే.. ఎవరి ఇష్ట ప్రకారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని తెలిపింది.