Andhra Pradesh : సహజ ప్రసవాల పెంపునకు ప్రత్యేక పథకం
రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల తగ్గింపుపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృస్టిని సారించింది. ఈ దిశగా సుశిక్షితులైన మిడ్‌వైవ్స్ (ప్రసూతి సహాయకులు) ద్వారా సహజ ప్రసవాల్ని ప్రోత్సహించే పథకానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు.
By Medi Samrat
రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల తగ్గింపుపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృస్టిని సారించింది. ఈ దిశగా సుశిక్షితులైన మిడ్‌వైవ్స్ (ప్రసూతి సహాయకులు) ద్వారా సహజ ప్రసవాల్ని ప్రోత్సహించే పథకానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు.
ప్రస్తుతం ప్రసవ సమయాల్లో ప్రభుత్వాసుపత్రుల్లోని స్టాఫ్ నర్సులే ప్రసూతి సేవల్ని అందిస్తున్నారు. వీరికి వివిధ అంశాలపై తగిన పరిజ్ఞానం, శిక్షణ కొరవడడంతో సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈలోటును తీర్చేందుకు ఎంపిక చేసిన స్టాప్ నర్సులకు 18 నెలల పాటు ప్రసవానికి ముందు, ప్రసవ సమయం, ప్రసవానంతర సేవలకు సంబంధించిన అంశాలపై సమగ్ర శిక్షణ అందించి మహిళలు సహజ ప్రసవాల పట్ల మొగ్గు చూపేలా ఈ ప్రత్యేక పథకాన్ని రూపొందించారు.
తొలి విడతలో సంవత్సరానికి 600 నుంచి 6,000 పైగా ప్రసవాలు జరుగుతున్న 86 ప్రభుత్వాసుపత్రుల్లో సుశిక్షితులైన 1264 మంది ప్రసూతి సహాయకుల్ని(మిడ్‌వైవ్స్) నియమిస్తారు. వీరు వివిధ సమయాల్లో అందించాల్సిన సేవలు, విధులపై సమగ్ర జాబ్ చార్టును రూపొందించి ప్రసూతి సేవల నాణ్యతను ఈ పధకం కింద పెంచుతారు. ఔట్ పేషెంట్(ఓపీ) సర్వీసుల్లో భాగంగా గర్భవతుల పూర్వ ఆరోగ్య వివరాలు, ప్రస్తుత స్థితి, ప్రసవ విషయ పరిజ్ఞానం, సరైన పోషణ, వ్యాయామ అవసరాలు, సహజ ప్రసవాల వల్ల కలిగే లాభాలను శిక్షణ పొందిన మిడ్‌వైవ్స్ అందిస్తారు. లేబర్ రూముల్లో ప్రసవ నొప్పులకు సంబంధించిన విషయ పరిజ్ఞానం మరియు వాటిని భరించే విధానం, సహజ ప్రసవానికి అవసరమైన సలహాలు, ఏవైనా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశాల గుర్తింపు మరియు చేపట్టాల్సిన చర్యలపై వీరు తగు సలహాలిస్తూ అప్రమత్తంగా ఉంటారు. ప్రసవానంతరం తల్లి మరియు బిడ్డ ఆరోగ్య పరిస్థితి అంచనా, తల్లిపాల విశిష్టతను వివరించడంతో పాటు తల్లీబిడ్డల మధ్య మానసిక అనుబంధాన్ని పెంచడం, ప్రసవానంతరం ఎదురయ్యే సమస్యలపై దృష్టి పెడతారు. ప్రస్తుత స్టాఫ్ నర్సుల విషయ పరిజ్ఞానం, శిక్షణా రాహిత్యాల వలన ప్రసవ సమయాల్లో డాక్టర్ల పాత్ర ఎక్కువగా ఉండడంతో...సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఒక అంచనా.
కేంద్ర ప్రభుత్వ సాయంతో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్ హెచ్ ఎం) కింద అమలయ్యే ఈ పధకానికి సంబంధించిన పలు అంశాల్ని లోతుగా చర్చించి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ పధకం విస్తృతిని పెంచాలని, గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవాలు నిర్వహించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి కేంద్రంలోనూ ఒక సుశిక్షిత ప్రసూతి సహాయకురాలు(మిడ్‌వైఫ్) ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ఈ పధకం కింద ఎంపిక చేసిన ప్రతి స్టాఫ్ నర్సుకు 18 నెలల పాటు సమగ్రమైన శిక్షణ అందించడానికి స్టైపెండ్‌తో కలిపి రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 56.12 శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగినట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వాసుపత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 41.40 శాతం సిజేరియన్లు కాగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 67.71 శాతం మేరకు సిజేరియన్ ప్రసవాలు జరిగాయి.