రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఈ ఏడాది మార్చిలోపు భర్తీ చేయాలని దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. బుధవారం నాడు వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు UDID కార్డులు, త్రీవీలర్ మోటార్ బైక్ ల పంపిణీ, దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లు, వయోవృద్ధులకు వయో వందన ఆయుష్మాన్ భారత్ కార్డులు, సహాయ పరికరాల పంపిణీ, ట్రాన్స్ జెండర్స్ కి గుర్తింపు కార్డులు, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లపై విస్తృత ప్రచారం కల్పించాలి, అడ్మిషన్లు 100 శాతం పూర్తి కావాలి. దివ్యాంగ పాఠశాలల్లో మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలి. విద్యార్థులకు మెనూ అమలులో రాజీపడొద్దు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సాహించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ ల్యాగ్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి మార్చిలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి. దివ్యాంగులకు ఉచితంగా ఇచ్చే త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీకి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలి. వయో వృద్ధులకు సహాయ పరికరాలు ఎక్కువ మందికి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.