గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు..

AP Govt farewell to Governor Biswabhushan Harichandan. బ‌దిలీపై వెళ్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు ప‌లికింది.

By Medi Samrat  Published on  21 Feb 2023 9:46 AM GMT
గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు..

బ‌దిలీపై వెళ్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు ప‌లికింది. ఈ వీడ్కోలు సమావేశానికి సీఎం జగన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ‌వ‌ర్న‌ర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ కి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. చత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా వెళ్తున్నందుకు స‌భా వేదిక‌గా అభినందనలు తెలియ‌జేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆత్మీయుడైన పెద్దమనిషిగా, గవర్నర్‌ వ్యవస్ధకు ఒక నిండుతనం తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు అని కొనియాడారు.


గవర్నర్‌గా ఉన్న ఈ మూడు సంవత్సరాల కాలంలో రాజ్యాంగ వ్యవస్ధల మధ్య ఉండాల్సిన సమన్వయం అన్నది ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారు. గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాల మీద ఈ మధ్య కాలంలోనే చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ మన రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా, తండ్రిలా, పెద్దలా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడి ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తూ మన గవర్నర్‌ వాత్సల్యం చూపించారని అన్నారు.

మన గవర్నర్‌ ఉన్నత విద్యావేత్త. న్యాయనిపుణులు. వీటన్నింటికీ మించి ఆయన స్వాతంత్య్ర సమరయోధులు కూడా. ఒడిశా ప్రభుత్వంలో నాలుగుసార్లు మంత్రిగా పనిచేసిన ఆయ‌న‌ తాను మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రతిశాఖలోనూ తనదైన ముద్ర చూపారని తెలిపారు. 5 సార్లు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైన ఆయన.. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధిపై 95 వేల మెజార్టీ సాధించి అప్పట్లో ఒక రికార్డు సృష్టించారని పేర్కొన్నారు.


న్యాయవాదిగా పనిచేసిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. ఒడిశా హైకోర్టులో బార్‌ అసోసియేషన్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా కూడా న్యాయవాదుల సంక్షేమం కోసం, హక్కుల కోసం నిరంతరం పాటుపడ్డారు. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రతిచోటా కూడా వెన్నుదన్నుగా నిల్చి ఆయన విజయానికి కారణమయ్యారు ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌. ఆమెకు కూడా సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గ‌వ‌ర్న‌ర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ కుటుంబం నిండు నూరేళ్లు జీవించాలని.. మీతో మా తీపి జ్ఞాపకాలు మా మనసులో ఎల్లప్పుడూ ఉంటాయని తెలుపుతూ సీఎం ప్రసంగం ముగించారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆత్మీయంగా సత్కరించారు సీఎం జగన్‌.


Next Story