ఏపీ సర్కార్ భారీ శుభవార్త..ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకున్న వేలాది కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది

By -  Knakam Karthik
Published on : 12 Feb 2026 5:53 AM IST

Andrapradesh, Amaravati, Unobjectionable Lands, AP Govt, House Regularisation

ఏపీ సర్కార్ భారీ శుభవార్త..ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకున్న వేలాది కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఈ నివాసాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే గడువును 2026, జూన్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ గడువు పొడిగింపుతో దరఖాస్తు చేసుకోలేకపోయిన వేలాది మంది పేదలకు తమ సొంత ఇంటి కల నెరవేరే అవకాశం లభించనుంది.

గతంలో ఉన్న గడువు ముగియడంతో, ప్రజల విజ్ఞప్తి మేరకు దీనిని జూన్ 30, 2026 వరకు పొడిగించారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాస గృహాలు నిర్మించుకున్న పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ పథకానికి అర్హులు. 100 గజాల లోపు స్థలంలో నివసించే నిరుపేదలకు అత్యంత తక్కువ రుసుముతో లేదా ఉచితంగా క్రమబద్ధీకరించేలా మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ పథకం కింద ఇచ్చే పట్టాలు కేవలం కుటుంబంలోని మహిళల పేరు మీదనే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం ఇచ్చే పట్టా ద్వారా సదరు భూమిపై యజమానులకు పూర్తిస్థాయి చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. ఈ పట్టాల ఆధారంగా బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందే వెసులుబాటు ఉంటుంది. క్రమబద్ధీకరించబడిన కాలనీల్లో డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, మంచినీటి కనెక్షన్ వంటి సదుపాయాలను ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో కల్పిస్తుంది. ఈ స్థలాలను భవిష్యత్తులో తమ పిల్లలకు లేదా వారసులకు బదలాయించుకునే హక్కు లభిస్తుంది.

Next Story