ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల హోదాను మారుస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఇకపై వీరంతా పోలీసు యూనిఫామ్ దరించి 'మహిళా పోలీసు'గా గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తారు. పోలీసు కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలు అన్ని కూడా వీరికి ఉంటాయి. అలాగే వీరికి దగ్గరలోని పోలీసు స్టేషన్ ప్రతినిధులుగా వ్యవహరిస్తారని ప్రభుత్వం జీవోలో వెల్లడించింది.
మాములుగా అయితే పోలీసు ఉద్యోగంలోకి వచ్చేవారికి శిక్షణ తప్పనిసరి. కాగా.. ప్రభుత్వం వీరికి కూడా పోలీసు శిక్షణ ఇస్తామంటుంది. అలాగే వీరికి పదోన్నతులు కూడా కల్పిస్తామని పేర్కొంది. దీనికోసం అదనంగా హెడ్ కానిస్టేబుల్ పోస్టులు సృష్టిస్తామని.. అందుకు అవసరమైన చట్ట సవరణలను చేస్తామని హోంశాఖ పేర్కొంది.
ఇదిలావుంటే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 14,910 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల పోస్టులకు గాను ప్రస్తుతం 14,313 మంది ఉన్నారు. త్వరలోనే వీరికి రెండేళ్ల ప్రొబెషన్ సర్వీసు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. 'మహిళా పోలీస్'గా పేర్కొంటూ కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతలు ప్రకటించడంతో వీరికి మరింత ప్రయోజనం కలగనుంది.