తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది.
ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 'సిట్' (SIT) విచారణ జరిపినప్పటికీ, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను, ప్రధాన వ్యక్తులను నిగ్గుతేల్చాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కఠిన చర్యలు తీసుకోనున్నారు.