వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. సీబీఐ అధికారి రాంసింగ్, వివేకా కూతురు సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డిపై కేసులు నమోదు చేశారని, కేసులో వీరిని ఇరికించేందుకు చూశారని అఫిడవిట్ లో ప్రభుత్వం తెలిపింది. రాంసింగ్ పై కేసు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి.రాజు కేసును విచారించలేదని తెలిపింది. తనను అవినాశ్ బెదిరించినట్టు రాజు అంగీకరించారని చెప్పింది.
తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అవినాశ్, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని కృష్ణారెడ్డి చెప్పిన దానిలో నిజం లేదని తెలిపింది. చాలా మంది సాక్షులు తాము స్టేట్మెంట్ ఇవ్వనేలేదని విచారణలో తెలిపారని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. వివేకా హత్య కేసు నుంచి విముక్తి పొందేందుకు అవినాశ్ కుట్ర పన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.