జిల్లాల పునర్ వ్యవస్దీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ది లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవటం అనుచరణీయమన్నారు. నూతన జిల్లాల ఏర్పటుతో పునర్ వ్యవస్దీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో సోమవారం పాలన ప్రారంభం కావటం అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్దికి బాటలు వేస్తుందని విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేసారు.
నూతన జిల్లాల ఏర్పాటుపై ఏపీ గవర్నర్ ఏమన్నారంటే..కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వంలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందని ఇది రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుందన్నారు. నూతన జిల్లాలతో అభివృద్దిలో ప్రాదేశిక సమానత్వం, పధకాల అమలులో మరింత వేగం, ప్రజలకు చేరువగా పాలన సాధ్యమవుతుందన్న అశాభావాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యక్తం చేసారు. ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్దం చేయటం మంచి ఆలోచన అని గవర్నర్ పేర్కోన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.