అమరావతి: దేవాలయాల్లో తొక్కిసలాటల ఘటనల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా క్రమం తప్పకుండా పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొక్కిసలాటల నివారణకు ముందస్తు చర్యలు తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియామకం చేపట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులు, తీసుకున్న చర్యలు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.
2019-24 మధ్యలో దేవాలయాలపై దాడుల ఘటనలపై తీసుకున్నచర్యలపై పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , హోం మంత్రి వంగలపూడి అనిత , అనగాని సత్యప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.