రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం.. రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు

రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేయనుంది.

By అంజి  Published on  12 Feb 2025 8:39 AM IST
AP government, new pass books, farmers, APnews

రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం.. రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు

అమరావతి: రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేయనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాసు పుసక్తాలను పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూముల రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాసుపుస్తకాలను వెనక్కి తీసుకోనుంది. వాటిస్థానంలో కొత్తగా ప్రింట్‌ చేసిన పుస్తకాలను ఇవ్వనుంది. ఈ మేరకు మంగళవారం నాడు జరిగిన కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వివరించారు.

పాసుపుస్తకాలపై వైఎస్‌ జగన్‌ ఫొటోలు ఉండటంతో వాటిని రైతులు తిరస్కరిస్తున్నారని, వచ్చే నెల నాటికి సర్వేరాళ్లపై జగన్‌ బొమ్మలు, పేర్లు తొలగించే పని కూడా పూర్తవుతుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఈ నెల చివరాఖరు నాటికి పరిష్కరిస్తామని మంత్రి అనగాని తెలిపారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ నిరోధక చట్టం.. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి. సిసోడియా తెలిపారు. కేంద్రం ఆ చట్టాన్ని త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూముల అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుకు త్వర లో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.

Next Story